కోనసీమ ప్రకృతి అందాలను, వాతావరణాన్ని ఆస్వాదించడానికి కుటుంబంతో కలిసి రెండు రోజుల వినోద పర్యటనకు వెళ్లాను. బంగాళాఖాతంలో గోదావరి సంగమం దృశ్యం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించింది. గోదావరి డెల్టా వ్యవస్థలో అంతర్భాగమైన, “వైనతేయ గోదావరి నదిపై నిర్మించిన జలవాహిని (అక్విడెక్టు)”, పి. గన్నవరం కాలువ, ఉపకాలువలకు రెండు వైపులా పంట కాలువలు, వాటికి నీటిని మళ్లించే గేట్లు, లాకులు, మురుగు కాలువ, కాలువలను అటు ఇటు దాటడానికి చిన్న చిన్న వంతెనలు, గోదావరి గట్టు, కాలువల గట్లు, వేల ఎకరాలలో విస్తరించిన కొబ్బరి తోటలు, పచ్చదనం మధ్య 24 గంటల సమయం రెండు గంటలుగా అలా గడిచిపోయింది. గోదావరి డెల్టా వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి తరానిదే!